కోదాడ, వెలుగు: ప్రైవేట్ రంగంలో ఉన్న సహకార బ్యాంకులు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోరారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి తో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖమ్మంలో ఒక్క శాఖతో మొదలుపెట్టి ఖాతాదారులకు నమ్మకమైన సేవలందించి నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 17 బ్రాంచ్లను విస్తరించడం వెనుక ఎంతో కృషి ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందించేందుకు రుణాలు అందిస్తున్న బ్యాంకు యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. బ్యాంకు చైర్మన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ తమ బ్యాంకు రూ.930 కోట్ల లాభాలతో నడుస్తోందని తెలిపారు.
గృహ, వ్యాపార, విద్య, చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు రుణాలు తక్కువ వడ్డీకి అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ డాక్టర్ సుబ్బారావు, కాంగ్రెస్ నాయకుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా కోపరేటీవ్ అధికారి నామ శ్రీధర్, స్థానిక కౌన్సిలర్ లంకల రమాదేవి నిరంజన్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కసినిడి జయప్రకాశ్, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, గాదంశెట్టి, శ్రీనివాసరావు, వైస్ చైర్మన్లు సన్నే ఉదయ ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు, సీఈఓ దాసరి వేణుగోపాల్, బ్రాంచ్ మేనేజర్ వీరవల్లి కృష్ణమూర్తి పాల్గొన్నారు.