నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం..సీడీపీ జోరు!

  •     ఎన్నికలు నేపథ్యంలో ఎడాపెడా పనులు మంజూరు  
  •     15 రోజుల్లో వందల పనులకు శంకుస్థాపన
  •     భూమిపూజలతో బిజీగా గడుపుతున్న ఎమ్మెల్యేలు

యాదాద్రి, వెలుగు : ఎన్నికలు సమీపిస్తుండడంతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(సీడీపీ) ఊపందుకుంది. యాదాద్రి జిల్లాలో ఎమ్మెల్యేల ఒత్తిడితో 15 రోజుల్లోనే  వందల పనులు మంజూరయ్యాయి.  ఎమ్మెల్యేలు కూడా ఆలస్యం చేయకుండా వెంటవెంటనే శంకుస్థానలు చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం నుంచి మంజూరైనా పనులు నియోజకవర్గాల్లో చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి.  దీనిపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌‌ అభ్యర్థులను కూడా ప్రకటించారు. దీంతో వ్యతిరేకత పెరగకుండా ఎడాపెడా పనులు మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎన్నికల వేడితో..

2018 ఎన్నికల తర్వాత సీడీపీపై పెద్దగా దృష్టి పెట్టని ఎమ్మెల్యేలు.. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగానే రంగంలోకి దిగారు. తమ పరధిలోని రూ. మూడు కోట్లతో వర్క్స్​ను సిఫారసు చేయడం ప్రారంభించారు. సీడీపీ కింద సీసీ రోడ్లు, మురికినీటి కాలువలు, కమ్యూనిటీ హాల్స్​, కాంపౌండ్‌వాల్స్‌, కమిటీ హాళ్ల వంటి వాటికి నిధులను కేటాయించాల్సి ఉంటుంది. దీంతో తమ పార్టీకి చెందిన సర్పంచులు, కుల సంఘాలు, లీడర్లతో పనులు గుర్తించి సిఫారసులు చేస్తున్నారు. అయితే రూ. 5 లక్షల విలువైన వర్క్స్​ నామినేటెడ్​ పద్ధతిలో అవకాశం ఉండగా.. అంతకు మించితే టెండర్​ పిలవాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెల్యేలు ఎక్కువగా నామినేటేడ్ పద్ధతిలో సిఫారసు చేస్తున్నారు. 

15 రోజుల్లో రూ. 4 కోట్ల వర్క్స్​

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  తమ నియోజకవర్గాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించుకునేందుకు వీలుగా ప్రభుత్వం సీడీపీ కింద ఏడాదికి రూ.3 కోట్ల నిధులు ఇస్తోంది.  యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేలు పనులను వేగంగా సిఫారసు చేస్తున్నారు. గడిచిన 15 రోజుల్లోనే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి రూ. 1.50 కోట్లు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రూ . 1.30 కోట్లు, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి చౌటుప్పల్​, సంస్థాన్​ నారాయణపురం మండలాల్లో రూ. 60 లక్షలు, నకిరేకల్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట మండలంలో రూ. 40 లక్షల పనులకు సిఫారసు చేశారు. 

వరుసగా శంకుస్థాపనలు

సిఫారసులు చేయడంతో పాటు శాంక్షన్​ విషయంలోనూ ఎమ్మెల్యేలు స్పీడ్​గా ముందుకెళ్తున్నారు. ఇంకా టైమున్నా.. 2023-–24 పైనాన్షియల్​ ఇయర్‌‌కు సంబంధించిన పనులను మొత్తం ఒక్క నెలలోనే శాంక్షన్​ చేయించుకోవడం గమనార్హం. ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్​విడుదల అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గతంలో శాంక్షన్​ అయిన వర్క్స్​తో పాటు సీడీపీ పనులకు హడావుడిగా​ శంకుస్థాపనలు చేస్తున్నారు. కేవలం మూడు రోజుల్లోనే వివిధ స్కీమ్స్​ కింద రూ. 30 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టే పనులకు భూమిపూజ చేశారు.