- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల, వెలుగు: బీఆర్ఎస్ అధికారంలో ఉంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేవాడినని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్ అధ్యక్షతన జరిగిన పాలక మండలి వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, ప్రజల మన్ననలను పొందాలంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలని, అప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. చేర్యాల పట్టణ అభివృద్ధికి కౌన్సిల్ సభ్యులు ఎంతో కృషి చేశారన్నారు.
అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయిస్తానన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశంలో ప్రభుత్వం దగ్గర తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. మొదటి అసెంబ్లీ మీటింగ్ లో కూడా రెవెన్యూ డివిజన్ అంశం పై మంత్రులకు తెలియజేశానన్నారు. అనంతరం చైర్ పర్సన్ స్వరూప రాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు లింగం, చంటి, నరేందర్, కనకలక్ష్మి యాదగిరి, జుబేదా కతూర్, ఇన్నమ్మ భాస్కర్ రెడ్డి, సురేశ్, లీలా సంజీవులు, తారా యాదగిరి, సతీశ్ గౌడ్, కమీషనర్ ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.