- రెండు చోట్ల ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు
- మరో వివాదంలో జనగామ ఎమ్మెల్యే
జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల పోచారం ఐటీ కారిడార్‌లో భూ కబ్జా కేసులో ఇరుక్కున్న ఆయన తాజాగా రెండు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేయించుకోవడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండాలి. కానీ ఆయన డిసెంబర్ 27న చేర్యాలలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేయించుకున్నారు. తర్వాత రెండు రోజులకే డిసెంబర్ 29న జనగామలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
చేర్యాల మున్సిపాల్టీలో గతనెల 19న పాలక వర్గం పై పెట్టిన అవిశ్వాసం వీగిపోవడానికి ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు కావడం దోహదపడింది. జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కి చేర్యాల మున్సిపల్ అవిశ్వాసం సవాల్‌గా మారింది. మున్సిపల్ పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చేర్యాల మున్సిపాలిటీలో డిసెంబర్ 27న సభ్యుడిగా నమోదు చేయించుకున్నారు. చేర్యాలలో మొత్తం 12 మంది కౌన్సిలర్లకు గాను ఐదుగురు బీఆర్ఎస్, ఐదుగురు కాంగ్రెస్, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు.
ఇండిపెండెంట్ల సాయంతో అప్పుడు బీఆర్ఎస్ పాలకవర్గం ఏర్పాటైంది. చైర్పర్సన్, వైస్చైర్మన్లపై బీఆర్ఎస్కు చెందిన నలుగురు, ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు డిసెంబర్ 21న అవిశ్వాసాన్ని ప్రకటించి సిద్ధిపేట అడిషనల్ కలెక్టర్‌కు లేటర్ ఇచ్చారు. దీంతో జనవరి 19న అవిశ్వాసంపై ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పల్లా సభ్యుడిగా నమోదు కావడంతో అవిశ్వాసం నెగ్గాలంటే 9మంది మీటింగ్‌కు హాజరు కావాల్సిఉంటుంది. ఆయన తనతో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కాకుండా మేనేజ్ చేశారు.
దీంతో ఏడుగురు మాత్రమే హాజరుకాగా కోరం లేదని అవిశ్వాసం వీగిపోయినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యూహం ఫలించినట్టయ్యింది. చేర్యాలలో ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఉంటూ జనగామ మున్సిపాలిటీలోనూ ప్రమాణ స్వీకారం చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జనగామ మున్సిపాలిటీలోనూ అవిశ్వాసం ప్రతిపాదించే అవకాశం ఉండడంతో ఇక్కడ తన ఓటు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో రూల్స్‌కు విరుద్ధంగా ఆయన ఇక్కడ ఓటరుగా నమోదైనట్టు భావిస్తున్నారు.
జనగామలో ప్రమాణం చేశారు
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గత డిసెంబర్ 29న జనగామ మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన తొలిసారి జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌కు వచ్చారు. అదే రోజు ప్రమాణం చేయించాను.
- చంద్రమౌళి, మున్సిపల్ కమిషనర్, జనగామ