
చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ది పనులకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎ. స్వరూపరాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డితో కలిసి ఆర్యవైశ్య వైకుంఠధామానికి, మూడో వార్డులోని అంబేద్కర్ భవన్ ముందు సీసీ రోడ్డుకు, నాలుగో వార్డులో సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి మొత్తంగా రూ.25 లక్షల పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే చేర్యాల మున్సిపాలిటీకి రూ.10 కోట్ల అభివృద్ధి పనులను తీసుకువచ్చానని, వాటికే ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నానని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన నిధులను, తానే తీసుకువచ్చినట్లు ఓడిపోయినవాళ్లు ప్రచారం చేసుకోవడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ వాళ్లు తనతో అభివృద్ధిలో పోటీ పడాలంటే కొత్తగా ఫండ్స్ తీసుకురావాలని సవాల్ విసిరారు.
అనంతరం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎం నాగేశ్వర్రావును, పాస్టర్ మోజెస్ పాల్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు. కౌన్సిలర్లు పి. సతీశ్ గౌడ్, ఎం బాలనర్సయ్య, అంజయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు నీల శివకుమార్, ఎ సంపత్, కొండయ్య, జగన్నాథం, ఉప్పల నాగరాజు, పెద్ది రమేశ్ ఉన్నారు.