ప్రాణం ఉన్నంత వరకు బీఆర్‌‌ఎస్‌‌లోనే ఉంటా : పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి

జనగామ అర్బన్, వెలుగు : తన ప్రాణం ఉన్నంత వరకు బీఆర్‌‌ఎస్‌‌లోనే ఉంటానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి చెప్పారు. తాను పేదలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. జనగామ మండలం వడ్లకొండ శివారులో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. జనగామలో పార్టీ బలంగా ఉందని, కార్యకర్తలందరూ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా పనిచేశారన్నారు.

నియోజకవర్గంలో 130 గ్రామాలకుగానూ 120 గ్రామాల్లో తనకు స్పష్టమైన మెజార్టీ వచ్చిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. తాను జనగామలోనే అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. అంతకుముందు కలెక్టరేట్‌‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించాలని సూచించారు.