జనగామ, వెలుగు : జనగామ పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. చైర్‌పర్సన్ పోకల జమున లింగయ్య అధ్యక్షతన శుక్రవారం జనగామ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్‌లో నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్‌లో ఎమ్మెల్యే మాట్లాడారు.
చీటకోడూరు రిజర్వాయర్ నుంచి మంచినీటిని అందించేందుకు ఆఫీసర్లతో కలిసి త్వరలోనే రిజర్వాయర్‌ను సందర్శిస్తానని చెప్పారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు కో ఆర్డినేషన్‌తో పనిచేసి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. అంతకుముందు మున్సిపల్ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.
పెండింగ్ సమస్యలపై కౌన్సిలర్ల ఆగ్రహం
సమావేశం ప్రారంభం కాగానే పలువురు సభ్యులు పట్టణ సమస్యలను మీటింగ్ దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ఎన్నిసార్లు చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కౌన్సిలర్ గాదెపాక రాంచందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహంకాళి హరిశ్చంద్రగప్తా మాట్లాడుతూ సిబ్బందిని పెంచకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.
పెరిగిన జనాభాకు అనుగుణంగా లేబర్‌ను పెంచాలని కోరారు. ఇన్‌చార్జుల స్థానంలో పూర్తి స్థాయి ఆఫీసర్లను నియమించాలని కోరారు. అనంతరం వంగాల కల్యాణి, మారబోయిన పాండు, జక్కుల అనిత వేణు మాధవ్ మాట్లాడారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ పర్మర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. కౌన్సిలర్లు సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. సమావేశంలో ఇన్‌చార్జ్ కమిషనర్ చంద్రమౌళి, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ పాల్గొన్నారు.