కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్టు అధికారులపై చర్యలు తీసుకోవాలి :ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు

కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్టు అధికారులపై చర్యలు తీసుకోవాలి :ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు
  •  ఆమరణ దీక్షకు దిగిన సిర్పూర్ టి ఎమ్మెల్యే హరీశ్ బాబు
  • సిర్పూర్ టి ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట  దీక్షా శిబిరం

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్టు ఆఫీసర్లు మాఫియాగా ఏర్పడి రైతులు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు కోరారు. సోమవారం  సిర్పూర్ టి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పీసీసీఎఫ్ సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని  అన్నారు.  

ఒక్క కర్జెళ్లి రేంజ్ లోనే గత ఆరు నెలలుగా వేలాది టేకు చెట్లను నరికి స్మగ్లింగ్ చేశారని దీంట్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్నారు.  భూపాలపట్నం, చీలపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.  ఇటీవల సిర్పూర్ రేంజ్ లోని లక్ష్మీపుర్ లో అడవి పందిని హతమార్చిన కారణంగా ఎనిమిది మంది రైతుల మీద ఫారెస్ట్ ఆఫీసర్ లు కేసు నమోదు చేసి బంధించి దాడి చేశారన్నారు.  

దీనికి బాధ్యులైన సిర్పూర్ టీ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ అధికారిని  సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలెం వెంకటేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి తదితరులు  పాల్గొన్నారు.