
- కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరం
- కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం
- అభివృద్ధి నిధుల కోసమే సీఎంను కలిశారన్న సన్నిహితులు
ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు బుధవారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంతో బీజేపీ చేపట్టిన విజయ్ సంకల్ప్ యాత్రలో ఆయన పాల్గొనడం లేదు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా హరీశ్ బాబు దూరంగా ఉంటున్నారు. దీంతో బీజేపీ వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. అయితే, పార్టీ మారుతారనే పుకార్లను హరీశ్ బాబు సన్నిహితులు ఖండించారు.
సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే హరీశ్ బాబు సీఎం రేవంత్‌ను కలిశారని చెప్తున్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరినట్టు తెలిపారు. సరిపడా నిధులు మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాల్సిందిగా రేవంత్‌ను హరీశ్ విన్నవించారని అంటున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంపై కూడా చర్చించినట్టు తెలిపారు. ఆయన నానమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే విజయ్ సంకల్ప్ యాత్రతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఉమ్మడి జిల్లాలోని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన బలమైన నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.