ఆదిలాబాద్,వెలుగు : కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస్ నీచమైన రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హితవు పలికారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలకతీతంగా ఆదిలాబాద్ డెవలప్ మెంట్ కు కృషి చేస్తుంటే ఓర్వలేక శ్రీనివాస్ రెడ్డి బురద రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలు విశ్వసించరన్నారు.
బీసీ బిడ్డగా రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేక దురుద్దేశంతో అవమానించే రీతిలో మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదిలాబాద్ అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని, జిల్లా మంత్రి సీతక్కను కలిస్తే తప్పేంటన్నారు. వాళ్లు తనకిచ్చే గౌరవాన్ని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సాత్నాల ఇరిగేషన్ కోసం ఉంచిన భూమిని కంది శ్రీనివాస్ కబ్జా చేశారని ఆరోపించారు. నేను ఎక్కైడనా తప్పు చేసినట్లు ఉంటే పూర్తి విచారణకు సిద్ధమని ప్రకటించారు.