పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం : ఎమ్మెల్యే పాయల్​శంకర్​

పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం : ఎమ్మెల్యే పాయల్​శంకర్​

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆదిలాబాద్​ బీజేపీ ఎమ్మెల్యే పాయల్​శంకర్​అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గోదావరిఖని, నస్పూర్, మంచిర్యాల కేంద్రాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్ నాయకులు గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో నస్పూర్​లో ఎస్సై సుగుణాకర్ బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసి స్టేషన్​కు తరలించడం దారుణమన్నారు. గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి న్యాయమూర్తులతో దురుసుగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేవంలో బీజేపీ నాయకులు విజయ్, నగేశ్, లాలామున్నా, రఘుపతి, వేద వ్యాస్, దినేశ్ మటొలియా, రాజన్న, శివ పాల్గొన్నారు.