ఆదిలాబాద్ టౌన్, వెలుగు: బోరజ్ నుంచి బేల మండల సరిహద్దుల్లోని మహారాష్ట్ర వరకు చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం జైనథ్ మండలం తరోడా బ్రిడ్జి వద్ద జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ సర్వే పనులను ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో సైతం రాకపోకలు కొనసాగేలా తరోడ బ్రిడ్జి పక్క నుంచి రూ.3 కోట్ల వ్యయంతో డైవర్షన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపుతామని చెప్పారు. గతంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభించేలా కృషి చేస్తామన్నారు. ఆయన వెంట నాయకులు అశోక్ రెడ్డి, గజానంద్, ముకుంద్, తదితరులు ఉన్నారు.
క్యాంప్ కార్యాలయంలో వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహనీయుల ఫొటోలకు ఎమ్మెల్యే శంకర్ పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ తరహాలో కాకుండా ప్రజాపాలన అందించాలని కోరారు. నాయకులు లాలా మున్నా, ముస్తాపూర్ అశోక్, జోగు రవి, దినేశ్ మటోలియా, సునంద రెడ్డి, ధోని జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.