మణుగూరు, వెలుగు : సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మణుగూరులోని హనుమాన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తపించే మల్లన్న అందరికీ తెలిసిన వ్యక్తి అన్నారు.
కౌన్సిల్లో పట్టభద్రుల కోసం పోరాడే ఏకైక గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాలని కోరారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ పట్టభద్రులను నిలువునా ముంచింది కల్వకుంట్ల కుటుంబమేనని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశాయని మండిపడ్డారు. పట్టభద్రులు తనను ఆశీర్వదించి ఎమ్మెల్సీగా కౌన్సిల్ కు పంపించాలని కోరారు.
కార్యకర్తలు కృషిచేయాలి
దమ్మపేట : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపునకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం దమ్మపేట మండలం గండుగులపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో తీన్మార్ మల్లన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తీన్మార్ మల్లన్నను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని రఘురాంరెడ్డి కోరారు.
మల్లన్న మాట్లాడుతూగత ఎన్నికల్లో తనకు ఎలాంటి బలం లేనప్పటికీ లక్షన్నర ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు వచ్చానని, జిల్లా మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదంతో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కాంగ్రెస్ జిల్లా నాయకులు పిడమర్తి రవి పాల్గొన్నారు..
అంతా మన వైపే..
సత్తుపల్లి : ఎమ్మెల్సీ ఎన్నికలో సర్వేలన్నీ తమ వైపే ఉన్నాయని తీన్మార్ మల్లన్న అన్నారు. సత్తుపల్లి, వేంసూరు పెనుబల్లి , కల్లూరు తల్లాడ మండలాల కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ముఖ్య నాయకులు, పట్టభద్రుల సమావేశం బుధవారం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడే వారి పట్ల కర్కషంగా వ్యవహరించిన కేసీఆర్ తన కూతురు తీహార్ జైల్లో ఎందుకు ఉందో ప్రజలకు చెప్పాలన్నారు. బీజేపీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ ఎంపీ అభ్యర్థి రామ రఘురాంరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలరాణి పాల్గొన్నారు.
మల్లన్న గెలుపు అవసరం
ఖమ్మం టౌన్ : నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు అవసరమని సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఎస్ కే జానిమియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ లు పదేళ్ల పాలనలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. మల్లన్నకు తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తోందని తెలిపారు.
భారీ మెజార్టీ ఇవ్వాలి
పాల్వంచ రూరల్ : ప్రజా సమస్యలపై ఎప్పటికప్పడు స్పందించే తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ ఎన్నికలో భారీ మెజార్టీ ఇవ్వాలని డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పాల్వంచ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొత్వాలతోపాటు కాంగ్రెస్, మిత్రపక్షాలు నాయకులు, కార్యకర్తలు పర్యటించి ఓట్లను అభ్యర్థించారు.
పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ప్రచారం..
ఎర్రుపాలెం : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. మధిర ఇన్చార్జ్ జావిద్, ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం సత్తా మరోసారి నిరూపించాలి
తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఖమ్మం సత్తా ఏంటో మరో మారు నిరూపించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ కోరారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మల్లన్న విజయం కోసం ఇండియా కూటమి పార్టీలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, ఇద్దరిలో ఎవరు గెలిచినా పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. పట్టభద్రులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని, మల్లన్నును గెలిపించాలని కోరారు