బూర్గంపహాడ్, వెలుగు : ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకపోతే చర్యలు తప్పవని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం బూర్గంపహాడ్ మండలంలో పర్యటించారు. తొలుత బూర్గంపహాడ్ లోని ప్రభుత్వ బాలికల గురుకుల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమయానికి తమకు భోజనం పెట్టడం లేదని, హాస్టల్ డైనింగ్ రూమ్ దుర్వాసన వస్తోందని, నీటి సమస్య కూడా ఉందని వారు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మెనూ ప్రకారం సమయానికి భోజనం అందజేయాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. మండలంలో రూ.20లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లతో పాటు, రెడ్దిపాలెం గ్రామంలో ఐటీసీ ఆధ్వర్యంలో నిర్మించిన బస్ షెల్టర్, అంగన్ వాడీ కేంద్రం, బూర్గంపహాడ్ లోని ఐకేపీ కార్యాలయంలో మహిళా శక్తి కుట్టు కేంద్రంలో టైలరింగ్ హబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో జమలారెడ్డి, ఐకేపీ ఏపీఎం నాగార్జున, పీఆర్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ చారి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి వెంకటేశ్వర రెడ్డి, నాయకులు జక్కం బలరాం, పోతిరెడ్ది వెంకటేశ్వర రెడ్డి, మందా నాగరాజు, కైపు శ్రీనివాస రెడ్డి, భజన సతీశ్, మారం వెంకటేశ్వర రెడ్డి, బర్ల నాగమణి, కాంగ్రెస్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.