మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో తాము సంయమనం పాటించినా బీజేపీ నేతలు,కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈటల రాజేందర్ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. నిన్న ప్రణాళిక ప్రకారమే టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు రాళ్ల దాడి చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటల రాజేందర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆయన ధన అహంకారంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. తమపై దాడి చేయమని ఈటల రాజేందర్ బీజేపీ కార్యకర్తలకు చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. దాడికి కారణమైన ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేస్తే బీజేపీ కార్యకర్తలకు ఎందుకు గాయాలు కాలేదన్నారు. ఈటల PA మహేష్ కూడా తమపై రాళ్లు విసిరాడని తెలిపారు.
గంజాయి,లిక్కర్ బ్యాచ్ లను వెంటేసుకుని ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం చేశారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పలివెలలో జరిగిన దాడికి సంబంధించి ఎన్నికల కమిషన్ కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని.. ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారన్నారు.