నర్సంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా : పెద్ది సుదర్శన్‌‌రెడ్డి

  • మళ్లీ ఛాన్స్‌‌ ఇస్తే ఇంకా డెవలప్‌‌ చేస్తా   
  • నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌రెడ్డి

నర్సంపేట/నెక్కొండ, వెలుగు : నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌రెడ్డి అన్నారు. వరంగల్‌‌ జిల్లా నర్సంపేట, నెక్కొండలో బుధవారం పార్టీ ఆఫీస్‌‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన నిజాయితీ, కమిట్‌‌మెంట్‌‌ను చూసి మరోసారి ఛాన్స్‌‌ ఇస్తే నియోజకవర్గాన్ని ఇంకా డెవలప్‌‌ చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎక్కడా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. మళ్లీ కేసీఆర్‌‌ సీఎం అయితేనే రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్నారు.

రంగరాయచెరువు, పాకాల చెరువు ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలకు పస లేని విమర్శలు చేయడం తప్పితే ప్రజలకు ఏం చేస్తారో చెప్పే స్పష్టతే లేదని ఎద్దేవా చేశారు. మినీ ట్యాంక్‌‌బండ్‌‌ తీసుకొస్తే పనులు జరగకుండా ప్రతిపక్ష లీడర్లు కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు ఓట్లు వేయించుకొని ప్రజలకు మొండి చేయి చూపారే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మరో నెల తర్వాత ప్రతిపక్ష లీడర్లు స్లీపింగ్‌‌ మోడ్‌‌లోకి వెళ్లిపోవడం ఖాయమన్నారు.

కేసీఆర్‌‌ను ఓడించాలని ప్రచారం చేస్తున్నారు తప్పితే, ప్రజలకు ఏం చేస్తామో బీజేపీ లీడర్లు చెప్పడం లేదన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టోను కూడా త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.  నర్సంపేటలో రాయిడి రవీందర్‌‌రెడ్డి, గుగులోతు రామస్వామినాయక్‌‌, నల్లా మనోహర్‌‌రెడ్డి, గుంటి రజనీ కిషన్‌‌, డాక్టర్‌‌ లెక్కల విద్యాసాగర్‌‌రెడ్డి, మునిగాల వెంకట్‌‌రెడ్డి, గోగుల రాణాప్రతాప్‌‌రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణ, గోనె యువరాజు, నెక్కొండలో సూరయ్య, రమేశ్‌‌యాదవ్‌‌, రమేశ్‌‌, రాము, సంపత్‌‌రావు పాల్గొన్నారు.