భద్రాద్రిలో కాంగ్రెస్ ​ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్​ శనివారం శ్రీకారం చుట్టింది. ముందుగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు చేసిన డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆ తర్వాత మసీదు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. అనంతరం అంబేద్కర్​, అల్లూరి సీతారామరాజు, మల్లుదొర, ఘంటం దొర, కొమరంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రచారం ప్రారంభించారు. పార్టీ ఎన్నికల ప్రచార రథంపై పొదెం వీరయ్య, టీపీసీ మెంబర్​ బుడగం శ్రీనివాసరావు, టౌన్​ ప్రెసిడెంట్ సరెళ్ల నరేశ్, చింతిరేల రవికుమార్​, అడబాల వెంకటేశ్వరరావు, వసంతాల రాజేశ్వరీ

ఎన్ఎస్​యూఐ లీడర్లు చింతిరేల సుధీర్, ఎడారి ప్రదీప్, మహ్మద్​ఖాన్​ ఎక్కి రోడ్​ షో నిర్వహించారు. వీరయ్య మాట్లాడుతూ బీఆర్​ఎస్​ సర్కారు భద్రాద్రిని దగా చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్​ రూ.100కోట్లు, రూ.1000కోట్లు అంటూ కాలం వెళ్లబుచ్చారని, కనీసం సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకురాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఈసారి బీఆర్​ఎస్​కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.