- రాజులం అనుకుంటే తన్ని అవతల పడేస్తరు
- ఇంజినీర్లపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫైర్
- సీతమ్మసాగర్ బ్యారేజ్ కరకట్టల పనుల అడ్డగింత
భద్రాచలం, వెలుగు : ‘కోరెగడ్డ నిర్వాసిత రైతులకు పరిహారం ఇవ్వకుండా పనులు చేస్తే తగులబెడ్తం’ అంటూ డీసీసీ ప్రెసిడెంట్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్ల మండలం కొత్తపల్లి గోదావరి తీర ప్రాంతంలో సీతమ్మసాగర్ బ్యారేజీలో భాగంగా నిర్మిస్తున్న కరకట్టల పనులను మంగళవారం రైతులతో కలిసి ఎమ్మెల్యే అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఇంజినీర్లను నిలదీశారు. ‘మీరు కోర్టు ఆర్డర్లు ఒబే చేయరా? వ్యవస్థలను మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మీరేమైనా రాజులా? అలా అనుకుంటే ప్రజలు తన్ని అవతల పడేస్తారు జాగ్రత్త’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘యాజ్ ఏ ఎమ్మెల్యేగా చెబుతున్నా చట్టవ్యతిరేకంగా పనులు మొదలు పెడితే తగులబెడ్తాం’ అని అన్నారు. అనుమతులు లేవని ఎన్జీటీ స్టే ఇస్తే పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ‘మీకు ఎవరు చెబుతున్నారు. కలెక్టరా? మీ ఎస్ఈనా? వాళ్లను తీసుకురండి. రైతులతో మాట్లాడి వాళ్లు ఓకే అంటే చేసుకోండి’ అని అన్నారు. కోరెగడ్డ నిర్వాసిత రైతులకు ఎకరానికి రూ.8లక్షల పరిహారం ఇవ్వాలని, వారికి ఎంజాయ్మెంట్ సర్వే చేసి జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రెండో విడత చేపట్టే భూ సర్వేలో ఎకరానికి రూ.30 లక్షల పరిహారం, భూమికి భూమి ఇవ్వాలన్నారు. కాదని పనులు చేపడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పర్యావరణ అనుమతులు తెచ్చాకనే సీతమ్మసాగర్ బ్యారేజీ , కరకట్టల నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.