శిలాఫలకం లేకుండా శంకుస్థాపన ఎలా? అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు శిలాఫలకాలు ఆవిష్కరిస్తుంటారు. అయితే ఓ చోట అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాప్రతినిధి పనుల శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు. 

ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి చౌటుప్పల్​ మున్సిపాలిటీ కేంద్రంలోని 10వ వార్డ్​లో ధోబీ ఘాట్​ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి ఆగస్టు 10న వచ్చారు. 

పనులు జరిగే ప్రదేశానికి వెళ్లి చూసిన ఎమ్మెల్యే షాక్​ అయ్యారు. ప్రారంభోత్సవం చేసే శిలాఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ఆయన కంగుతిన్నారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం లేకుండా శంకుస్థాపన ఎలా చేయాలని వారిని ప్రశ్నించారు. చేసేదేమీ లేక వెనుదిరిగారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.