- స్థలాన్ని పరిశీలించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి సాయికుంటలోని 14 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొత్తం 14 ఎకరాల స్థలంలో 2 ఎకరాలు నర్సింగ్ కాలేజీ కోసం, 12 ఎకరాలు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కేటాయిస్తామన్నారు. అందులో ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపడుతామని తెలిపారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చి క్రీడాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. మంచిర్యాలను క్రీడల హబ్‌గా మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
మంచిర్యాలలో రూ.300 కోట్లతో 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు రూ.255 కోట్లతో కరకట్ట నిర్మాణం పనులు ఈ నెలాఖ రులో ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. గడువులో పూర్తి చేసి తీరుతామని.. రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాల నేతలు సకాలంలో నిర్మాణం పూర్తయితే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఏకమై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వర్ రెడ్డి చిలకజోస్యం మానుకోవాలి
సీఎం రేవంత్ రెడ్డికి పదవీ వియోగం ఉందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చిలక జోస్యం చెప్పడం మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. జిల్లా కేంద్రంలోని ఐబీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత జ్యోతిష్యం నేర్చుకున్నాడని ఎద్దేవా చేశారు. ఐదేండ్లు అధికారంలో ఉంటామని, వచ్చే ఎన్నికల్లోనూ 100 సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రావడం అసంభవమని, బీఆర్ఎస్ దుకాణం మూత పడిందన్నారు.