ఇండస్ట్రియల్​ ఐటీ హబ్​గా మంచిర్యాల

ఇండస్ట్రియల్​ ఐటీ హబ్​గా మంచిర్యాల
  • మంచిర్యాలలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు ప్లాన్
  • వేంపల్లి శివారులో 292 ఎకరాలు గుర్తింపు 
  • స్థలాలను పరిశీలించిన టీజీఐఐసీ అధికారులు
  • ఆటోనగర్​, ఇందిరమ్మ ఇండ్లు కూడా అక్కడే..

మంచిర్యాల, వెలుగు: వ్యాపార, వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన మంచిర్యాలను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేయడానికి అడుగులు పడుతున్నాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​ రావు చొరతో జిల్లా కేంద్రానికి సమీపంలో ఇండస్ట్రియల్​హబ్, ఐటీ పార్క్​ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం హాజీపూర్​ మండలం వేంపల్లి, పోచంపాడ్ గ్రామాల శివార్లలో 292 ఎకరాల గవర్నమెంట్, అసైన్డ్​ ల్యాండ్స్​ను గుర్తిం చారు. గురువారం టీజీఐఐసీ అధికారులు ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. కొత్తగా ఆటోనగర్​ను ఏర్పాటు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా అదే ప్రాంతంలో నిర్మించడానికి ప్లాన్​ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చినట్లయితే త్వరలోనే మంచిర్యాలకు మహర్ధశ వస్తుందని భావిస్తున్నారు. 

అందుబాటులో వనరులు 

సింగరేణి, వ్యవసాయ అనుబంధ, ఫుడ్​ ప్రాసెసింగ్​పరిశ్రమలతో పాటు ఇతర మైనర్, మీడియం ఇండస్ట్రీస్​ నెలకొల్పడానికి అవసరమైన అన్ని వనరులు మంచిర్యాలలో అందుబాటులో ఉన్నాయి. జైపూర్​సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​ నుంచి కరెంట్, సింగరేణి కోల్​మైన్స్​ నుంచి బొగ్గు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని కేటాయించే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను కలుపుతూ రైల్వే లైన్ ఉండగా, రాష్ట్రంలోని అన్ని నగరాలను అనుసంధానిస్తూ నేషనల్​ హైవేలను నిర్మిస్తున్నారు. 

బోధన్–జగ్దల్​పూర్ ఎన్ హెచ్​63, మంచిర్యాల–చంద్రాపూర్​ఎన్​హెచ్​363 ఇప్పటికే పూర్తయ్యాయి. మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–విజయవాడ నేషనల్ ​హైవే 163 పనులు ప్రారంభం కాను న్నాయి. మెరుగైన ట్రాన్స్​పోర్ట్​ సౌకర్యం ఉండడంతో ఇక్కడ తయారైన వస్తువులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చు. జిల్లాలో ఇంజనీరింగ్, కన్​స్ట్రక్షన్​ రంగానికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్​ క్వాలిఫైడ్ ​మ్యాన్ ​పవర్​కు సైతం కొదువలేదు.

ఐటీ పార్క్​ ఏర్పాటుకు సైతం

ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ (ఐటీ) అనగానే హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాలే గుర్తొస్తాయి. జిల్లాకు చెందిన చాలా మంది యువతీ యువకులు దేశంలోని వివిధ సిటీలతో పాటు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఐటీ జాబ్స్​లో స్థిరపడ్డారు. ప్రతి ఏటా వేలాది మంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. మంచిర్యాలలో ఐటీ పార్క్​ ఏర్పాటు చేసినట్లయితే లోకల్​గానే ఐదంకెల జీతంతో ఐటీ జాబ్స్​లభించే అవకాశం ఉంటుంది. 

కుటుంబాలను విడిచి దూరప్రాంతాలకు వెళ్లలేని మహిళలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటికే బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటు ఇంజనీరింగ్​గ్రాడ్యుయేట్లకు అవసరమైన ట్రెయినింగ్​ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఈ రెండు కంపెనీల్లో 300 మందికిపైగా పనిచేస్తున్నారు. మంచిర్యాలలో ఇండస్ట్రియల్ ​హబ్ ​ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశం 

ఇండస్ట్రియల్​ హబ్​లో రూ.కోటి నుంచి రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు జిల్లాకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​ రావు తెలిపారు. గురువారం కలెక్టర్​ కుమార్​ దీపక్, టీజీఐఐసీ అధికారులతో కలిసి ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​సభ్యులతో జిల్లా కేంద్రంలోని ఓ హోటల్​లో మీటింగ్​ నిర్వహించారు. మంచిర్యాలలో ఇండస్ట్రీల​స్థాపనకు అవకాశాలను, ప్రభుత్వం తరఫున అందించనున్న ప్రోత్సాహాన్ని వారికి వివరించారు.

 అలాగే వేంపల్లి శివారులోని 156, 157, 158, 159, పోచంపాడ్​ శివారు 1 సర్వే నంబర్లలోని ప్రతిపాదిత స్థలాలను టీజీఐఐసీ అధికారులు పరిశీలించారు. ఇండస్ట్రీస్, ఐటీ పార్క్, ఆటో నగర్​ఏర్పాటుకు అనుకూలంగా రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్, వాటర్​ సప్లై వంటి సౌకర్యాలను అభివృద్ధి చేసి కంపెనీలకు స్థలాలను కేటాయించనున్నట్టు ప్రకటించారు. అసైన్డ్​ భూముల సేకరణకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.