- లక్ష ఓట్ల మెజార్టీ కోసమే ప్రచారం
దండేపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలువబోతున్నారని, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజార్టీ కోసమే ప్రచారం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం, నంబాల, వెల్గనూర్, కాసిపేట, కొండాపూర్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. యువకుడు, విద్యావంతుడైన వంశీ ఈ ప్రాంత యువతీయువకులకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కలిపించాలనే సంకల్పంతో ఎన్నికల రంగంలో నిలిచాడని అన్నారు.
సేవా దృక్పథం ఉన్న వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతులకిచ్చిన మాట ప్రకారం ఆగస్టు15 లోపు రూ.2 లక్షల రుణ మాఫీ చేసి తీరుతామన్నారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించాడని, ఆయన కుటుంబం మాత్రం వేలకోట్లు కూడబెట్టుకుందని ఆరోపించారు. దండేపల్లి జడ్పీటీసీ గడ్డం నాగరాణి త్రిమూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు, గూడెం ఎంపీటీసీ మోహన్, నంబాల, వెల్గనూర్ మాజీ సర్పంచ్లు గోపతి పుష్పలత, బిళ్లకూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.