
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులు అద్దంకి దయాకర్ ,శంకర్ నాయక్, విజయశాంతి మార్చి 10న అసెంబ్లీలో నామినేషన్ వేశారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,పలువురు మంత్రులు నామినేషన్ కార్యక్రమానికి వచ్చారు. సీపీఐ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. ఇక బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. శ్రవణ్ కు మద్దతుగా కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.
2025, మార్చి 10తో నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ముగియనుండగా.. ఒక్క రోజు ముందు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో సోమవారం (మార్చి 10) కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. 2025 మార్చి 29తో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న విషయం తెలిసిందే.
అనూహ్యంగా రాములమ్మ పేరు
అసెంబ్లీలో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి. అయితే పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటును సీపీఐకి కేటాయించింది. ఒక్క ఎమ్మెల్సీకి 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ టికెట్ మాజీ ఎంపీ విజయశాంతికి దక్కడం చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి ఎమ్మెల్సీ రేసులో రాములమ్మ పేరు లేదు. చివర్లో అనూహ్యంగా ఆమె పేరు తెరపైకి వచ్చింది. విజయ శాంతి నేరుగా ఢిల్లీలోనే పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి ఎమ్మెల్సీ టికెట్ సాధించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం టికెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ హైకమాండ్ ప్రియారిటీ ఇచ్చింది. పార్టీ ఆదేశాల మేరకు అద్దంకి దయాకర్ తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ వదులుకోగా.. విజయ శాంతి మెదక్ ఎంపీ టికెట్ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే వీరి త్యాగాలను గుర్తించిన అధిష్టానం.. ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చింది.