
- కాంగ్రెస్ నుంచి శంకర్ నాయక్, దయాకర్
- సత్యంకు సీపీఐ, శ్రవణ్‌కు బీఆర్ఎస్ నుంచి ఛాన్స్
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాకు సముచిత స్థానం దక్కింది. శాసన మండలిలో ఒకేసారి నలుగురు ఎమ్మెల్సీలు అడుగుపెట్టే అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఒకవైపు బీసీ రిజర్వేషన్లు, మరోవైపు ఎస్సీ వర్గీకరణ అంశాలపైన రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ రెండింటికీ కట్టుబడి ఉన్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో చేసి చూపెట్టింది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యమన్న ప్రచారం ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో తుడిచిపెట్టుకుపోయింది. బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ బాటలోనే నడవాల్సి వచ్చింది. చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన వెలువడగానే నల్గొండ జిల్లాకు చెందిన దాసోజు శ్రవణ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.
మాట నెగ్గించుకున్న మంత్రులు..
కాంగ్రెస్ లో విధేయులకే పదవులు దక్కుతాయని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ లీడర్లకే ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి అభ్యర్థుల ఎంపికలో మాట నెగ్గించుకున్నారు. జిల్లా కాంగ్రెస్ లో ఒకే సామాజిక వర్గ పెత్తనం నడుస్తోందన్న విమర్శలకు కౌంటర్ గా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, ఎస్సీ(మాల) సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, కాంగ్రెస్, సీపీఐ పొత్తు లో భాగంగా సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం(యాదవ)లు అభ్యర్థులుగా ఎంపికయ్యారు.
బీఆర్ఎస్ సైతం బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ డిక్లేర్ చేయక తప్పలేదు. ఈ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి ఒక్కరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నందున ఆ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు మరో మార్గం లేక శ్రవణ్‌ను ఎంపిక చేసిందన్న చర్చ జరుగుతోంది. నల్గొండ పట్టణానికి చెందిన ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు.
సామాజిక కూర్పు సక్సెస్..
బీఆర్ఎస్ పదేళ్ల పాటు పవర్లో ఉన్నప్పటికీ జిల్లాలో కాంగ్రెస్ కేడర్ చెక్కు చెదరలేదు. ఉత్తమ్, కోమటిరెడ్డిలను ఎంపీలుగా గెలిపించడంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కీలకంగా వ్యవహరించారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికలు, కార్పొరేషన్ పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గం నుంచి వేముల వీరేశం, మందుల సామేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మాల సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు అదే వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.
ఎస్టీ ఓటర్లు బలంగా ఉన్న నల్గొండ ఎంపీ సెగ్మెంట్లో ఎస్టీ రిజర్వుడ్‌లో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఒక్కరే ఉన్నారు. కాబట్టి, శంకర్ నాయక్ ను ఎమ్మెల్సీగా ప్రకటించడం ఆ వర్గం ఓటర్లు బలంగా ఉన్న ఉత్తమ్, జానారెడ్డిల నియోజకవర్గాల్లో కొత్త ఉత్సాహం నింపింది. అయితే, శంకర్ నాయక్ ఎంట్రీతో బాలునాయక్ కు కేబినెట్లో చోటు దక్కకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.
శాసన మండలిలో నల్గొండదే పైచేయి..
శాసన మండలిలో నల్గొండదే పైచేయిగా నిలిచింది. మండలి అత్యున్నతి స్థానమైన చైర్మన్ పదవిలో గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతుండగా, నలుగురు ఎమ్మెల్సీల ప్రకటనతో మండలిలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారి సంఖ్య ఐదుకు చేరనుంది.