దుబ్బాక, వెలుగు: రాష్ట్ర మంత్రులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. కుల, మత, వర్గం, పక్షపాత ధోరణి, రాగద్వేషాలకు తావులేకుండా ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన మంత్రులే పేదలను పార్టీల పేరుతో విడగొడుతున్నారన్నారు. శనివారం దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కును వెనక్కి తీసుకున్నానని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పడం సిగ్గుచేటన్నారు.
దుబ్బాకకు వచ్చిన పెద్దలు, రాష్ట్ర మంత్రులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి కొబ్బరికాయలిచ్చి గౌరవించామన్నారు. అలాంటిది ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్ తనపై వెటకారంగా మాట్లాడడం ఆయన విజ్ఞతకు, వివేకానికే వదిలిపెడుతున్నానని చెప్పారు. వ్యక్తిగతంగా తనపై విమర్శలు, ఆరోపణలు చేసుకోవచ్చని, కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శిస్తే తెలంగాణ ప్రజలు సహించరన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కును వెనక్కి తీసుకున్న ఆర్టీసీ చైర్మన్గోవర్ధన్ను ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం రఘోత్తంపల్లి స్కూల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించతలపెట్టిన మోడల్ టాయిలెట్స్, వంట గది పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. భూంపల్లి గ్రామంలో కరెంట్‌షాక్‌తో చనిపోయిన బాల్శెట్టి భార్గవి కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 4.5 లక్షల చెక్కును అందజేశారు.