టీఆర్ఎస్, కాంగ్రెస్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నిక రాగానే అధికార పార్టీకి అభివృద్ధి గుర్తుకు వస్తుందని ఆరోపించారు. తోటపల్లి లో రిజర్వాయర్ రైతుల వద్దంటే బలవంతగా శంకుస్థాపన చేసిన సీఎం.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. ఇన్నాళ్లు మునుగోడును ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఈ నియోజకవర్గానికి తాగు, సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వ్యక్తులపై తప్పుడు ప్రచారం చేసి టీఆర్ఎస్ లబ్ధి పొందాలనే ప్రయత్నిస్తుందని ఆరోపించారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు.. కానీ ప్రజలు మాత్రం శాశ్వతం అని వారు ఎక్కడికి పోరన్నారు.
మునుగోడులో రూ.1000 కోట్లు పంచి అయినా సరే టీఆర్ఎస్ గెలవాలని విశ్వప్రయత్నం చేస్తుందని రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురం రోడ్డును 2014లో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంజూరు చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఆ రోడ్డును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. హుజురాబాద్ లో కూడా దళిత బంధు ఆపడానికి బీజేపీ నేతలు రాయని ఉత్తరాన్ని ఇచ్చినట్లు తప్పుదోవ పట్టించారు.అక్కడ టీఆర్ఎస్ ఆటలు సాగలేదు. ఇప్పుడు మునుగోడులో గొర్రెల పంపిణీ విషయంలో కూడా ఇలానే జరుగుతుందని..ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. మాఫియాల నుంచి వచ్చిన డబ్బులతో సంతలో గొర్రెలను కొనుగోలు చేసినట్టు నాయకులను కొంటున్నారని రఘునందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన రఘునందన్ రావు ..టీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
వారం రోజులపాటు ఢిల్లీలో మకాం వేసిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో రహస్య మంతనాలు జరిపింది నిజం కాదా అని రఘునందన్ రావు నిలదీశారు.సమయం సందర్భం వచ్చినప్పుడు రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం నడిపింది ఎవరనేది ప్రజల ముందు ఉంచుతామన్నారు. బీజేపీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ కు అయ్యే ఎన్నికల ఖర్చును మొత్తం టీఆర్ఎస్ భరిస్తుందనే హామీ హస్తం పెద్దలకు ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సోషల్ మీడియా లో తప్పుడు ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు.