
- దుబ్బాకకు కేటాయించిన నిధులపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి
దుబ్బాక, వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దుబ్బాకకు అప్పుడప్పుడు వచ్చిపోయే టూరిస్టులని, వాళ్లు చెప్పే కల్లబొల్లి మాటలు దుబ్బాక ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. రఘునందన్‌రావు గెలిచాక దుబ్బాక నియోజకవర్గానికి ఏం చేశాడో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. దుబ్బాకకు ఏం చేశారని తండ్రి, కొడుకు, అల్లుడు వరుసబెట్టి వస్తున్నారని ప్రశ్నించారు.
ఇక్కడే తిరిగా, ఇక్కడే చదివా అని చెప్పుకునే సీఎం కేసీఆర్ దుబ్బాకకు కేటాయించిన నిధులపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దుబ్బాకకు వచ్చిన నిధులన్నీ అడ్డదారిలో మంత్రి హరీశ్‌రావు తీసుకపోయినప్పుడు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎందుకు అడ్డుకోలేదన్నారు. దుబ్బాక ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే రఘునందన్‌రావు ఊరుకోరని హెచ్చరించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిస్తేనే దుబ్బాకను రెవెన్యూ డివిజన్, రింగ్ రోడ్డు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ గెలవకుంటే ఇవ్వరా అని నిలదీశారు. కత్తి పోటు డ్రామాలతో కన్నీళ్లు పెట్టుకుంటే ఓట్లు రాలవని, ప్రభాకర్ రెడ్డి ఓడిపోయాక సిద్దిపేటలో పబ్పెట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నది రఘునందన్‌రావు అని, ఉద్యమం పేరుతో దోచుకున్నది సీఎం కేసీఆర్ అని, అగ్గిపెట్టె మంత్రి హరీశ్‌రావు పెట్రోల్ పోసుకున్నప్పుడు నేనే పక్కనే ఉన్నానని, నాలుగు గోడల మధ్య జరిగిన విషయాలు చెబితే కేసీఆర్, హరీశ్‌రావు ఉరేసుకుంటారని చెప్పారు.
బీఆర్‌ఎస్ డబ్బులు తీసుకొని బీజేపీకి ఓటెయ్యండి
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పదేండ్లుగా దోచుకున్న డబ్బులను తీసుకొని బీజేపీకి ఓటేసి తనను గెలిపించాలని రఘునందన్‌రావు కోరారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మండల అభివృద్ధి ఏనాడూ పట్టించుకోని ఎంపీ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు చెందిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితాలో పెట్టి కేసీఆర్ కుటుంబం అడ్డదారిలో అక్రమించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సిద్దిపేటలో కలెక్టరేట్ భవనాన్ని దళితుల భూముల్లోనే నిర్మించారని ఆరోపించారు. మిరుదొడ్డి మండలం బీజేపీకి, కరసేవకులకు అడ్డా అని, బీజేపీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు.