
దుబ్బాక, వెలుగు : 2016లో సీఎం కేసీఆర్ దుబ్బాక పర్యటనలో, దుబ్బాక ఉప ఎన్నికలో మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వివక్ష చూపడం తగదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. శనివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల అభివృద్ధికి అధికంగా నిధులు కేటాయిస్తూ ప్రతి పక్ష సభ్యులున్న నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు.
దుబ్బాక ఉప ఎన్నికలకంటే ముందు మంత్రి హరీశ్‌రావు ఆఘమేఘాల మీద ఇచ్చిన ప్రోసిడింగ్లను ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం దుబ్బాకకు వచ్చినప్పుడు ఫైర్ స్టేషన్ కోసం రైతు ఎకరం భూమి ఇస్తే అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదని గుర్తు చేశారు. అలాగే ఆయన చెప్పిన దుబ్బాక మున్సిపల్ భవనం నేటికీ అతిగతీలేదని మండిపడ్డారు.
సిద్దిపేటలో విపంచి, గజ్వేల్‌లో మహాతి అడిటోరియాలను నిర్మించి దుబ్బాకలో ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. టౌన్ అభివృద్ది కోసం టీయూఎఫ్ఐడీసీ నిధులొచ్చి 16 నెలలు గడుస్తున్నా పనులెందుకు నడుస్తలేవో చెప్పాలన్నారు. 2021లో దుబ్బాకలో ఇంటిగ్రెటేడ్ మార్కెట్ టెండర్ అయితే ఇంతవరకు కనీసం శిలాఫలకం పెట్టే దిక్కులేదని అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, పెండింగ్ భవనాలు, అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ. 50 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌కు లేఖ పంపుతున్నట్లు తెలిపారు.
అభివృద్ధి విషయంలో దుబ్బాక నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయంపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేశ్‌గౌడ్, మట్టా మల్లారెడ్డి, దూలం వెంకట్, పుట్ట వంశీ, మచ్చ శ్రీనివాస్, సుంకోజి ప్రవీణ్, రమేశ్ రెడ్డి, మారాటి బాబ తదితరులు పాల్గొన్నారు.