బీజేపీ వస్తే బీసీ సీఎం : రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ క్యాండిడేట్​ని సీఎం చేయడం ఖాయమని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. గురువారం అక్భర్​పేట-భూంపల్లి మండలంలోని ఖాజీపూర్​, వీరారెడ్డిపల్లి, జంగపల్లి, అస్మాస్​పూర్​ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్భర్​పేట-భూంపల్లి మండలం కోసం కొట్లాడానన్నారు.  2014 నుంచి 2020 వరకు బీఆర్​ఎస్​ వాళ్లు ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలుగా ఉండి అక్భర్​పేట-భూంపల్లిని ఎందుకు మండలంగా చేయలేదని ప్రశ్నించారు.

పింఛన్లు తామే అత్యధికంగా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికంగా లిక్కర్​ రేట్లను పెంచి ప్రజలను దోచుకుంటున్న విషయం ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలని డిమాండ్​ చేశారు. గొల్ల కుర్మలకు గొర్రెలు ఇప్పిస్తామని చెప్పి డీడీలు కట్టించుకుని ఇప్పటి వరకు గొర్రెలు ఇవ్వకుండా యాదవ సోదరులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ALSO READ : 2 వేల నోట్లను పోస్టులో పంపితే.. అకౌంట్లో డబ్బు డిపాజిట్​

రాష్ట్రంలో 64 లక్షల మంది ముదిరాజులుంటే బీఆర్ఎస్ ఒక్కరికి కూడా ఎమ్మెల్యే టిక్కెట్​ కేటాయించలేదని విమర్శించారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి దశల వారీగా నెరవేరుస్తూ వస్తున్నామని, మరొక్కసారి అవకాశమిస్తే దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.