
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
తొగుట, వెలుగు: మల్లనసాగర్ అదనపు టీఎంసీ కాలువలో భూములు కోల్పోయిన రైతులకు త్వరలోనే పరిహారం ఇప్పిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హామీ ఇచ్చారు. మంగళవారం తొగుట మండలం బండారుపల్లి గ్రామంలో పర్యటించారు. పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువలో భూములు కోల్పోయిన వారికి పరిహారం రాలేదని చెప్పగా.. త్వరలోనే ఇప్పిస్తానన్నారు. అనంతరం గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు.
నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం గమనించిన ఆయన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తర్వాత బీజేపీ నిర్వహిస్తున్న మేరా బూత్ సబ్సే మజ్బుత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చిక్కుడు చంద్రం, విభీషణ్ రెడ్డి, స్వామీ రెడ్డి, కల్యాణ్ దాస్, రాజశేఖర్, బాల్ రెడ్డి, ప్రశాంత్, రాజు, చంద్ర శేకర్, మురళి, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.