నువ్వు కబ్జా చేసిన భూమిలోనే నీ గోరి కడతాం: ఎమ్మెల్యే రఘునందన్‌ రావు

సొంత భూములకు రేట్లు పెంచుకునేందుకు  చెరువులో నిర్మల్ కలెక్టరేట్ కట్టించిన ఘనుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన బంధువులతో భూకబ్జాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.  మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి వరకు భూకబ్జాలు పాల్పడకపోతే.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవాలని సవాల్ చేశారు.  

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రానున్న ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసేందుకే జీవో 220ను దొంగ చాటుగా తీసుకొచ్చారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఆరు నెలల క్రితం రైతులు ఆందోళన చేస్తే వెనక్కి తగ్గినట్టుగా నమ్మించి రాత్రికి రాత్రి జీవోలను తీసుకొచ్చారని మండిపడ్డారు. రాబోయే రోజులలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆక్రమించుకున్న భూములలో ఆయన  గోరి కడతామని హెచ్చరించారు. 

నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసేంత వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు.  ఎందరో ఉద్యమకారులకు జన్మనిచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని గుర్తు చేశారు. జల్ జంగిల్ జమీన్ పై కొముురం భీమ్ పోరాటం అందరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన స్ఫూర్తితో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై పోరాటం చేయాలని రఘునందన్ రావు బీజేపీ నేతలు, స్థానిక రైతులకు పిలుపు నిచ్చారు.