
దుబ్బాక, వెలుగు: బీసీ బిడ్డలకు బీజేపీ హైకమాండ్పెద్దపీట వేస్తోందని, రానున్న కొద్ది రోజుల్లో ముదిరాజు బిడ్డకు సీఎం పదవి రాబోతుందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం అక్భర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేట, తాళ్లపల్లి, చిన్న నిజాంపేట, రామేశ్వరం పల్లి, కూడవెళ్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజులను పట్టించుకోని సీఎంకు ఓటు వేయడం అవసరమా అని ప్రశ్నించారు.
దళిత, బీసీ, మైనార్టీ బంధు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మెజార్టీ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ఉప ఎన్నికల్లో రఘునందన్ గెలిస్తే ఏమోస్తదని అన్నోళ్లకు అక్భర్పేట-భూంపల్లి మండలం చేసి ఇక్కడి ప్రజల వ్యయ ప్రయాసాలను తీర్చానన్నారు. ఇదే మండలం మీదుగా జాతీయ రహదారిని తీసుకొచ్చానన్నారు. దుబ్బాకలో వంద పడకల హాస్పిటల్, కొత్త బస్టాండ్‌ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చానని పేర్కొన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్లను పేదలకు పంపిణీ చేశామని తెలిపారు.
దక్షిణ కాశీగా పిలిచే కూడవెళ్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రసాద్దర్శన్ పథకం కింద ఎంపిక చేసి రూ.10 కోట్లు మంజూరు చేసి ఆలయ ఆభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదల పక్షాన నిలబడే రఘునందన్‌రావును అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలని కోరారు.ఈ సందర్భంగా బల్వంతాపూర్ సర్పంచ్ సౌడుబాల్లక్ష్మి కిష్టయ్య, ఉప సర్పంచ్ వెంకట స్వామి, వార్డు సభ్యులు కనకయ్య, విద్యా సాగర్, మహమ్మద్మౌలానా, శంకర్, రాజయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు.
అభివృద్ధి పేరిట వందల కోట్ల అవినీతి
సిద్దిపేట రూరల్: సిద్దిపేటలో అభివృద్ధి పేరిట వందల కోట్ల అవినీతి జరుగుతుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం బీజేపీ సిద్దిపేట అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ తో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. బీజేపీలో మాత్రమే ఒక కార్యకర్తకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, బీఆర్ఎస్ లో వందేండ్లయినా ఇలాంటి అవకాశం రాదన్నారు. తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు వస్తారన్నారు.
మంత్రి హరీశ్ రావు అహంకార మాటలు మానుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో బీఆర్ఎస్ కు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ రెండు స్థానాలు, బీఆర్ఎస్ 1 స్థానానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. దూది శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన ఇల్లు అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఈ ఎన్నికలు డబ్బు ఉన్నోడికి, లేనోడికి మధ్య జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే తనపై 48 అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు సమక్షంలో మాజీ పట్టణ కౌన్సిలర్ బాసంగారి వెంకట్ బీజేపీలో చేరారు.