
తొగుట, (దౌల్తాబాద్) వెలుగు: గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని గొడుగుపల్లి, లింగాయిపల్లి తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోకి ఇప్పుడు కొత్త బిచ్చగాళ్లు వస్తున్నారని వారి పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలన్నారు.
ఒక్క రోజు మద్యానికి, డబ్బుకు అమ్ముడు పోతే 5 ఏండ్లు అరిగోస పడాలని సూచించారు. ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత దుబ్బాక లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని మాటిచ్చారు. లింగాయి పల్లి తండా ప్రజలు గ్రామంలో మద్యం నిషేదం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
మన బిడ్డలకు సర్కారు కొలువులు రావాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం దిపయంపల్లిలో ముదిరాజ్ కులస్తుల అధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ కల్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కిషన్, యాదగిరి, భూపాల్, రామస్వామి పాల్గొన్నారు.