![నిరుద్యోగులను నిండా ముంచిన బీఆర్ఎస్ : రఘునందన్‌రావు](https://static.v6velugu.com/uploads/2023/11/mla-raghunandan-rao-says-unemployed-people-in-swarashtram-waiting-for-koluwa-for-ten-years_coBkMtgU8b.jpg)
దుబ్బాక, వెలుగు: నీళ్లు, నిధులు, నియామాకాల కోసం తెచ్చుకున్న స్వరాష్ట్రంలో నిరుద్యోగులు కొలువుల కోసం పదేండ్లుగా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని గంభీర్పూర్, శిలాజీనగర్, వెంకటగిరి తండా, దౌల్తాబాద్ మండలం కోనాపూర్, మందాపూర్, తిరుమలాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇవ్వమని ప్రభుత్వంతో కొట్లాడితే ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. పంటలను పరిశీలించడానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పంటలు పెద్దగా నష్టపోలేదని చెప్పి రైతుల కడుపు కొట్టారన్నారు.
పదేండ్లుగా ఎంపీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది కాలంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసి సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు చెప్పారు. తనకు దుబ్బాక ఒక కన్ను, సిద్దిపేట మరొక్క కన్ను అని చెప్పే మంత్రి హరీశ్‌రావు దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన నిధులను సిద్దిపేటకు తరలించాడన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉదయం 6 గంటలకు చాయ్ దొరకడం లేదు గానీ క్వాటర్ సీసా మాత్రం దొరుకుతుందని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగమని చెప్పి నిరుద్యోగులను నిండా ముంచిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజు బిడ్డలకు ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేని చేతగాని దద్దమ్మ కేసీఆర్ అని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ క్యాండిడేట్ముఖ్యమంత్రి అవుతారన్నారు. మరోసారి దుబ్బాకలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.