మునుగోడు, వెలుగు: ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ మునుగోడులో కాంగ్రెస్ కు అవసరమైన ప్రతి పైసా తానే ఖర్చు పెడతానని ఒప్పందం చేసుకున్నాడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మునుగోడులోని బీజేపీ క్యాంప్ ఆఫీసులో శనివారం మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే తాను గెలిచి వచ్చే ఎన్నికల్లో యూపీఏకు మద్దతిస్తానని మంతనాలు జరిపాడని, తమ దగ్గర సమాచారం ఉందన్నారు.
టైం వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం వహించిందెవరో చెప్తామని రఘునందన్ రావు అన్నారు. కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బులు, తీసుకున్న కమీషన్లను బయటికి తీసుకొస్తామన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారన్నారు. ‘మీరు కండువా కప్పి మీ పార్టీలో చేర్చుకున్న వాళ్లు మీ వాళ్లు అనుకుంటున్నారేమో..మేమే మీ వద్దకు పంపి ఉండొచ్చు కదా’ అని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, బీరెల్లి చంద్రశేఖర్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.