పాత సామాను పార్టీ నుంచి బయటకు పోతనే తెలంగాణలో బీజేపీకి పవర్: ఎమ్మెల్యే రాజాసింగ్

పాత సామాను పార్టీ నుంచి బయటకు పోతనే తెలంగాణలో బీజేపీకి పవర్: ఎమ్మెల్యే రాజాసింగ్

మరోసారి సొంతపార్టీ నేతలపై గోషామహల్  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి పాత సామాను బయటకు పోతేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం  వస్తే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని చెప్పారు. ఇలాంటి సీక్రెట్ మీటింగ్ లు పెడితే  పార్టీ అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు.  బీజేపీ అధిష్టానం వీటిపై దృష్టి పెట్టి.. రహస్యంగా భేటీ అవుతున్న వారిని రిటైర్ చేస్తేనే తెలంగాణలో పార్టీకి మంచిరోజులు వస్తాయన్నారు రాజాసింగ్.

 కొన్ని రోజుల నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 14 బహిరంగంగానే రాజాసింగ్ విమర్శలు చేశారు. పార్టీలో వేధింపులు తట్టుకోలేక పోతున్నానని అవసరం లేదని క్లారిటీ ఇస్తే ప్రాథమిక సభ్యత్వాన్నీ వదులుకునేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు.  గోల్కొండ–గోషామహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని తాను సూచించిన బీసీ నాయకుడికి కాకుండా ఎంఐఎం లీడర్ల వెంట తిరిగే వ్యక్తికి ఇచ్చారంటూ మండిపడ్డారు. 
‘2014లో భారతీయ జనతా పార్టీలో నేను చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నా.. ఇక నా వల్ల కావడం లేదు.. పార్టీకి నా అవసరం లేదు.. వెళ్లిపో అని అంటే ఇప్పటికిప్పుడే వెళ్లిపోవడానికి సిద్ధం.. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీ లేదా బీసీకి ఇవ్వాలని నేను సూచించాను.. కానీ, ఎంఐఎంతో సంబంధాలు కొనసాగించే వ్యక్తిని నియమించారు.

ALSO READ | ఫ్యూచర్ సిటీకి భూకేటాయింపులే కీలకం.. ఇప్పటికే 14వేల ఎకరాల సేకరణ

ఇదేంటని పార్టీకి చెందిన కీలక నేతకు ఫోన్‌ చేసి అడిగితే ఆ విషయం తనకు తెలియదని సమాధానం చెప్పారు.. ఆ జవాబుతో నా వెనుక జరుగుతున్న కుట్ర కోణం బయటపడింది. నేను ఇప్పటి వరకు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లతోనే పోరాటం చేస్తూ వచ్చాను. కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.. జిల్లా అధ్యక్ష పదవి అనేది పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వడం ప్రతిచోటా జరుగుతుంది. కానీ, ఇక్కడ నా సూచన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలి. వెంటనే అధ్యక్షుడిని మార్చాలి. జీవితంలో నేను ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం నేర్చుకున్నా.

ప్రస్తుతం పార్టీలో కొందరిలా బ్రోకరిజం నేను నేర్చుకోలేదు. వాళ్ల కారణంగా ఈ రోజు పార్టీ వెనుకబడింది. రాష్ట్రంలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాలి. కానీ ఇలాంటి రిటైరైన వ్యక్తులు ఉంటే బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఇపుడు మరోసారి  రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.