నాకు హోంశాఖ అంటే ఇష్టం..కేబినెట్ విస్తరణపై రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

నాకు హోంశాఖ అంటే ఇష్టం..కేబినెట్ విస్తరణపై రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తదనుకుంటున్నట్లు చెప్పారు. అయితే  తనకు హోంశాఖ అంటే ఇష్టమని అన్నారు. ఏ పదవి వచ్చినా సమర్దవంతంగా నిర్వహిస్తా.. ప్రజల పక్షాన నిలబడతానని చెప్పారు. కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలన్నారు.కేబినెట్ విస్తరణపై   ఢిల్లీలో సీరియస్ గానే  చర్చ జరిగినట్లు ఉందన్నారు. అయితే తనకు  ఇప్పటి వరకు  ఢిల్లీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని చెప్పారు రాజ్ గోపాల్ రెడ్డి. త్వరలో కానున్న కేబినెట్ విస్తరణలో రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తదనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

 తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగు లేదా ఐదు పోస్టులను ఉగాది కల్లా భర్తీ చేయనున్నట్లు తెలిసింది.  మంత్రి పదవులు దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టీలోని లంబాడకు ఇవ్వడంపై  చర్చించినట్లు తెలిసింది. చీఫ్ విప్ పదవి మాదిగ సామాజికవర్గానికి లేదంటే బీసీలో మంత్రి పదవి దక్కని మరో సామాజికవర్గానికి ఇచ్చే చాన్స్​ ఉంది. 

ALSO READ | నేను మిమ్మల్ని అనలేదు.. సునీత వ్యాఖ్యలకు స్పీకర్ వివరణ..అసలేం జరిగిందంటే..?

పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పదవుల భర్తీ పై కూడా చర్చించారు. పీసీసీ కార్యవర్గంలో మొదటి విడతగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 20 మంది వరకు పార్టీ ఉపాధ్యక్షులను నియమించి, మిగితా కార్యవర్గాన్ని తర్వాత వేసేందుకు హైకమాండ్ అనుమతిని  పీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్  తీసుకున్నట్లు తెలిసింది.  ఇక మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా వెంటనే పూర్తి చేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. 

నలుగురి శాఖల్లో మార్పు.. ఒకరికి ఉద్వాసన?

కేబినెట్ విస్తరణలో సామాజిక సమతుల్యం తప్పక పాటించాలని కాంగ్రెస్​ హైకమాండ్ నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే చాన్స్​ ఉంది.  అయితే కొత్తగా నలుగురిని లేదా ఐదుగురిని కేబినెట్​లోకి తీసుకోనుండటంతో పాటు ముగ్గురు, నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఓ మంత్రిని కేబినెట్​ నుంచి తప్పించే అవకాశం కూడా ఉందన్న చర్చ జరుగుతున్నది.