మునుగోడు గడ్డ.. కాంగ్రెస్ అడ్డా: రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ: మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా.. మునుగోడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా మీ రాజన్న ఎప్పుడూ ముందుంటాడని చెప్పారు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం చండూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఐ జిలా కార్యదర్శి నెల్లికంటి సత్యంతో కలిసి ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తనను ఎమ్మెల్యే గెలిపిస్తే అసెంబ్లీలో అభివృద్ధిపై పోరాడిన లాభం లేకపోవడంతో పదవికి రాజీనామా చేశానన్నారు. ఉప ఎన్నికల్లో తన ఒక్కడిని ఓడకొట్టడానికి వంద మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి రూ.వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.  అప్పుడు కూడా మునుగోడు ప్రజలు కేవలం తనను చూసి ఓటు వేశారు..తప్ప, బీజేపీ పార్టీని చూసి కాదన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి తనకు ఒక బాధ్యత అప్పగించారని.. ఆ బాధ్యత నెరవేర్చడం మనందరిపై ఉందని చెప్పారు.  

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల్లో ఇప్పటికే.. ఫ్రీ బస్సు, ఉచిత కరెంట్,  రూ.500 గ్యాస్ సిలిండర్ హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.  ఆగస్టు 15న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు.మరింత అభివృద్ధి జరగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థి చామల కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు