కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య ఫైర్​

కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య ఫైర్​

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: కడియం దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్​కౌంటర్ల సృష్టికర్త అని స్టేషన్​ ఘన్​ పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  ఆరోపించారు.  తెలంగాణలో ఎక్కడ జరగనన్ని ఎన్​కౌంటర్లు స్టేషన్​ఘన్​పూర్​లో జరిగాయని,  మాదిగ బిడ్డలు ఎక్కువ మంది ఎన్​కౌంటర్​అయ్యారని చెప్పారు. కడియం ఊళ్లలోకి వెళ్తే వాళ్ల ఆత్మలు ఘోషిస్తాయన్నారు.  జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలం తాటికొండ గ్రామంలో  శుక్రవారం దళితసంఘాల ఆధ్వర్యంలో ఆదిజాంబవంతుడి విగ్రహ ప్రతిష్ఠ, దళితుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.  ఎమ్మెల్యే రాజయ్య చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు..  ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి దమ్ముంటే తన లెక్క గ్రామాల్లో తిరగాలని  సవాల్​ విసిరారు. ఏనాడైనా దళితవాడల్లో పల్లెనిద్రలు చేశావా అని ప్రశ్నించారు.  మంత్రి కావాలంటే ఎమ్మెల్సీ సరిపోతుంది, ఎమ్మెల్యే ఎందుకు అని ఎద్దేవా చేశారు.  కడియం సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని అప్పటి వార్త పత్రికల్లో వరుస కథనాలు వచ్చాయన్నారు. ఆయన నీతిమంతుడు అని చెప్పుకోవడం జోక్​ అని ఎద్దేవా చేశారు. 

త్రిమూర్తులు సీఎం కేసీఆర్​, మంత్రులు కేటీఆర్​, హరీశ్​ రావు స్టేషన్​ఘన్​పూర్​ నియోజకవర్గంపై కరుణ చూపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.  సీఎం కేసీఆర్ తనకు అండగా ఉన్నారని చెప్పారు. రాజన్న వీడియోలు, ఆడియోలు ఉన్నాయని కొంత మంది చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కోర్టులను ఆశ్రయిస్తా, సైబర్​ క్రైం కింద కేసులు పెడ్తామన్నారు. ఆయనతో పాటు  జడ్పీ స్టాండింగ్​ కమిటీ చైర్మన్​ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, వైస్​ ఎంపీపీ చల్లా సుధీర్​రెడ్డి, సర్పంచ్ చల్లా ఉమాదేవి ఉన్నారు.