ఫాతిమా ఒవైసీ కాలేజీని కూల్చెయ్యాలె : ఎమ్మెల్యే రాజాసింగ్

ఫాతిమా ఒవైసీ కాలేజీని కూల్చెయ్యాలె :  ఎమ్మెల్యే రాజాసింగ్
  • ఒవైసీ బ్రదర్స్​కు సీఎం రేవంత్​రెడ్డి ​భయపడొద్దు

బషీర్​బాగ్/హైదరాబాద్, వెలుగు: ఒవైసీ బ్రదర్స్​ బండ్లగూడ సలకం చెరువులోని 12 ఎకరాలు కబ్జా చేసి ఫాతిమా ఒవైసీ కాలేజీని నిర్మించారని గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సదరు బిల్డింగ్స్​ను కూల్చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్​ఒవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని సూచించారు. ఈ మేరకు రాజాసింగ్​మంగళవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. చెరువులను కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 సలకం చెరువు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, అందులోని12 ఎకరాలను ఒవైసీ బ్రదర్స్ కబ్జా చేశారని, అందుకు గత బీఆర్ఎస్​ ప్రభుత్వం అండగా నిలిచిందని రాజాసింగ్​చెప్పారు. ఫ్రీ ఎడ్యుకేషన్ పేరుతో అసదుద్దీన్​ఒవైసీ, అక్బరుద్దీన్​ఒవైసీ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఫాతిమా కాలేజీని కూల్చేస్తే తమ వద్ద 40 వేల మంది స్టూడెంట్లు ఉన్నారంటూ ఒవైసీ ఇస్తున్న వార్నింగ్​కు సీఎం భయపడొద్దని కోరారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఇలాగే వార్నింగ్ ఇచ్చారని, కిరణ్​కుమార్​లెక్కచేయకుండా ఇద్దరినీ లోపలేశారని చెప్పారు. గోషామహల్లో సర్కారు భూముల కబ్జాకు గురయ్యాయని, కబ్జాదారులను వదిలిపెట్టొద్దని సీఎం రేవంత్ ను కోరారు.