బీజేపీ రాష్ట్ర పగ్గాలకు సరైన లీడర్లు కనిపించడం లేదు
అర్వింద్, సంజయ్ కొంత బెటర్: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదని, అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎప్పుడైనా జరగవచ్చని బీజేఎల్పీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డలే పాలిస్తున్నారని, అల్లుడు హరీశ్‌రావును కూడా దూరం పెట్టారన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సమర్థులెవరు తనకు పార్టీలో కనిపించడం లేదన్నారు. తాను బీజేఎల్పీ నేతగా ఉన్నందున, పార్టీ రూల్స్ ప్రకారం అధ్యక్ష పదవిని ఆశించే అర్హత తనకు లేదని, తన దృష్టిలో ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ కొంత బెటర్ అని చెప్పారు. తనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే రాష్ట్రంలో బీజేపీని ఎలా బలోపేతం చేస్తాననేదానిపై పార్టీ చీఫ్ అమిత్ షాకు లేఖ పంపానని చెప్పారు.