గత పాలకుల వల్లే ముథోల్​ వెనుకబడింది : ఎమ్మెల్యే పటేల్

గత పాలకుల వల్లే ముథోల్​ వెనుకబడింది : ఎమ్మెల్యే పటేల్

భైంసా, వెలుగు: బీఆర్ఎస్​పదేండ్ల పాలనలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ముథోల్ నియోజకవర్గం ఎంతో వెనుకబడిందని, అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. గురువారం అసెంబ్లీలో ప్రభుత్వానికి విన్నవిం చారు. ఒక్కో సమస్యను విన్నవిస్తూ నియోజక వర్గం వెనుకబడడానికి కారణాలేమిటో అసెంబ్లీలో వినిపించారు. వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా బ్రహ్మేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్​ను 

రూ.80 కోట్లతో నిర్మిస్తే.. పాలకుల నిర్లక్ష్యంతో ట్రాన్స్​ఫార్మర్లు, పరికరాలు దొంగలు దోచుకెళ్లా రని, సాగునీరందక ఆ ప్రాంత రైతులు పంటలు పండించుకోలేక వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వీటికి నిధులు ఇవ్వాలని కోరారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు లక్ష్యం 14వేల ఎకరాలకు సాగునీరు కాగా, సీసీ లైనింగ్ పూర్తికాక  కేవలం 5వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని, రూ.50 కోట్ల నిధులిచ్చి సీసీ లైనింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.

  పల్శికర్ రంగారావు ప్రాజెక్టు ద్వారా గుండెగాం వాసులు ఎంతో ఇబ్బంది పడ్డారని, ఇకనైనా తక్షణ పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జీవో జారీ చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బాసర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులిచ్చి, వెనక్కి తీసుకెళ్లిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.42 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. 2027లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయని, బాసర ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా కోరారు.