భైంసా, వెలుగు: దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. ముథోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. బుధవారం తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన రామారావు పటేల్ప్రధానితో భేటీ అయ్యి నియోజకవర్గ సమస్యలను ఆయనతో చర్చించినట్లు చెప్పారు. ముథోల్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, బీజేపీ ఎమ్మెల్యేలున్నచోట కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందన్నారు.
కేంద్రం నుంచి నిధులు ఇచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. సీఎస్ఆర్ నిధులు, అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణానికి, ఉపాధి హామీ పథకంలో పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించారని, సంబంధిత శాఖ మంత్రులకు చెప్పి ప్రత్యేక నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పటేల్ తెలిపారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను పటేల్ ఆయనకు విన్నవించారు.