భైంసా మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి : రామారావు పటేల్

భైంసా మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి : రామారావు పటేల్

భైంసా, వెలుగు: భైంసా మండలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ఎంపీపీ అబ్దుల్ రజాక్ అధ్యక్షతన బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. భారీ వర్షాలతో సిరాల ప్రాజెక్టు దెబ్బతిన్నదని, గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని, ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి దగ్గరికి పలుమార్లు వెళ్లడంతో రూ.9 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 

6 నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ బాగుండేలా చూడాలన్నారు. సమావేశంలో సభ్యులు పలు అంశాలను ప్రస్తావించగా.. ప్రమాదవశాత్తు ఉన్న విద్యుత్ తీగలను తక్షణమే సరి చేయాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. 

రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. మిషన్ భగీరథ అధికారులు గ్రామాల్లో  నీటి సమస్య రాకుండా చూడాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ దీప సొలంకి భీంరావు, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, మండల విద్యాధికారి సుభాష్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.