మార్కెట్ యార్డు నిర్మాణానికి కృషిచేస్తా : ముథోల్​ ఎమ్మెల్యే రామారావు పటేల్​ 

మార్కెట్ యార్డు నిర్మాణానికి కృషిచేస్తా : ముథోల్​ ఎమ్మెల్యే రామారావు పటేల్​ 

ముథోల్, వెలుగు: నిర్మల్​ జిల్లా ముథోల్​లో మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముథోల్​లో సబ్ మార్కెట్ యార్డు నిర్మాణానికి అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఎత్తిపోతల ప్యాకేజీ పనులు పూర్తయితే 50 వేలకు పైగా సాగునీరందుతుందని వెల్లడించారు. ముథోల్ నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆయా రంగాల్లో అభివృద్ధి కృషి చేస్తానన్నారు.

మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ముథోల్ క్యాంప్ ఆఫీస్​లో ముథోల్​కు చెందిన 33 మంది, తానూర్​ మండలాలకు చెందిన 30 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బైంసా మార్కెట్ చైర్మన్ ఆనందరావు పటేల్, తహసీల్దార్ శ్రీకాంత్, నాయకులు పోతన్న యాదవ్, బోయెడి అనిల్, వెంకటాపూర్ రాజేందర్, యజాజుద్దీన్, సుదర్శన్, రమేశ్, భూమేశ్, శ్రీనివాస్, సంతోష్, వీడీసీ అధ్యక్షుడు విట్టల్, విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.