నా నియోజకవర్గంలో .. నీ పెత్తనమేంది? మంత్రిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్

  • మంత్రి అజయ్​పై వైరా ఎమ్మెల్యేరాములు నాయక్ ఫైర్​
  • కేసీఆర్, కేటీఆర్​కు సామంత రాజులా వ్యవహరిస్తున్నడని కామెంట్​
  • తప్పుడు సర్వేలతో తనకు టికెట్ రాకుండా చేశాడని ఆగ్రహం
  • కార్యకర్తల సమావేశంలో మంత్రిపై తీవ్ర విమర్శలు 

ఖమ్మం/ వైరా, వెలుగు: మంత్రి పువ్వాడ అజయ్ పై వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు సర్వేలతో తనకు టికెట్ రాకుండా చేసి.. తనను అగౌరవపరుస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఫైర్​ అయ్యారు. శుక్రవారం వైరాలో బీఆర్​ఎస్​ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ మీటింగ్​లో ఎమ్మెల్యే మాట్లాడారు. "వైరా ఎమ్మెల్యేగా నేనున్నాను. వచ్చే ఎన్నికల్లో మరొకరు గెలిచే వరకు నేనే ఎమ్మెల్యేను. నాకున్న రాజ్యాంగ హక్కుల్లో జోక్యం చేసుకొని, నా విధులకు మంత్రి ఆటంకం కలిగిస్తున్నారు. మంత్రి గారిది ఖమ్మం నియోజకవర్గమా? వైరా నియోజకవర్గమా? నా నియోజకవర్గంలో మీ పెత్తనమేంటి. సీఎం కేసీఆర్ రాజులా, మంత్రి కేటీఆర్ యువరాజులా సుపరిపాలన అందిస్తుంటే, మధ్యలో మీరు సామంతరాజులా ఎక్కువ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను గౌరవించాలని తెలియదా? ప్రొటోకాల్ ను అగౌరవపరుస్తూ నన్ను మానసికంగా వేధిస్తున్నారు. తప్పుడు సర్వేలతో టికెట్ నాకు కాకుండా మరొకరికి ఇప్పించారు. ఇప్పుడు వచ్చిన అభ్యర్థి కూడా గిరిజనుడే. వంద శాతం ఆయన్ను గెలిపించేందుకు పనిచేస్తా. గిరిజనులైన మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి గ్రూపులు ఏర్పాటు చేసి ఆ మంటల్లో చలికాగుదామనుకుంటున్నారా..? ఉమ్మడి జిల్లాలో ఇలా పార్టీ నాయకులు మధ్య చిచ్చు పెడుతూ, అందరినీ ఓడగొట్టి మీరొక్కరే గెలవాలని అనుకుంటున్నారా’’ అని రాములు నాయక్ ప్రశ్నించారు.  సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు పెద్దయెత్తున మంత్రి అజయ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 

చిచ్చురేపిన దళితబందు లబ్ధిదారుల ఎంపిక

2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన రాములు నాయక్, ఆ తర్వాత కొద్దిరోజులకే బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రాములు నాయక్ కు కాకుండా, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ను బీఆర్ఎస్ ఎంపిక చేసింది. దీంతో రాములు నాయక్ అసంతృప్తితో ఉన్నా.. పార్టీ విజయం కోసం మదన్ లాల్ తో కలిసి పనిచేస్తానంటూ ప్రకటించారు. ఇటీవల మదన్ లాల్ వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన సమయంలోనూ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఇక దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి 1,100 మందిని రాములు నాయక్ సూచించగా, మదన్ లాల్ మరో 472 మంది పేర్లను సూచించారు. మదన్ లాల్ పంపిన జాబితాను మంత్రి అజయ్ ఎండార్స్ చేసిచ్చారని, అధికారులపై మంత్రి ఒత్తిడి తెచ్చి లబ్ధిదారుల ఎంపికలో జోక్యం చేసుకుంటున్నారని రాములు నాయక్ ఆరోపిస్తున్నారు. దళితబంధు, గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలో తాను సూచించిన వారిని కాకుండా, మదన్ లాల్ ప్రపోజ్ చేసిన వారిని అధికారులు లబ్ధిదారులుగా ఎంపిక చేశారని, దీనికి మంత్రి అజయ్ ఒత్తిడే కారణమని ఎమ్మెల్యే అంటున్నారు. మదన్ లాల్ కు మంత్రి అజయ్ సపోర్ట్ ఉందని ఆరోపిస్తున్నారు. కాగా, ఇన్ని రోజులు జిల్లాలో మంత్రికి వ్యతిరేకంగా ఎవరూ ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. దీంతో రాములు నాయక్ వెనుక ఎవరు ఉన్నారని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ లోకి ఒకరిద్దరు ముఖ్య నేతలు వెళ్తున్న సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండాల్సింది పోయి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో లీడర్లలోనూ తీవ్ర చర్చ నడుస్తున్నది.