- సాఫ్ట్ వేర్ లా ఉన్నోన్ని.. హార్డ్ వేర్ గా మారిపోతా
- కేసీఆర్ చెబితే చెరువులోనైనా దుంకుతానని కామెంట్
వైరా, వెలుగు: ‘‘బీఆర్ఎస్లో కొనసాగితే ప్రొటోకాల్‌తో పాటు గౌరవం ఉంటది. పార్టీ నుంచి వేరు పడాలని ఎవరైనా చూస్తే నేను ఊర్కోను.. ఇప్పటివరకు సాఫ్ట్ వేర్ లాగే ఉన్నా.. ఎవరైనా పార్టీ మారితే మాత్రం హార్డ్ వేర్ లాగా మారిపోతా. చట్టాన్ని చేతుల్లోకి తీస్కోవాల్సి వస్తది’’ అంటూ వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పార్టీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్‌కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులతో కలిసి త్వరలో బీఆర్ఎస్ వీడి, బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. పొంగులేటి వెంట కొందరు బీఆర్ఎస్ లీడర్లు కూడా వెళ్లిపోతారనే చర్చ నడుస్తున్న తరుణంలో ఎమ్మెల్యే రాములు నాయక్ ఆవేశంగా ఈ వ్యాఖ్యలు చేయడం వైరా నియోజకవర్గంలో కలకలం రేపింది.
బీఆర్ఎస్లో ఉంటే ఆఫీసర్ లెక్క గౌరవం..
‘‘ఇప్పటివరకు మనమంతా ఒకే కుటుంబంగా కొనసాగినం. ఈ బీఆర్ఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సహించబోను” అని ఎమ్మెల్యే హెచ్చరించారు.“బీఆర్ఎస్లోనే కొనసాగితే గెజిటెడ్ ఆఫీసర్లలా ప్రొటోకాల్ తో పాటు గౌరవం కూడా దొరుకుతది. ఇప్పటిదాకా నేను ఎవ్వరినీ కించపర్చలేదు. అగౌరవంగా చూడలేదు. రాష్ట్రాన్ని బీజేపీ అక్రమంగా కబళించాలని చూస్తాంది. మనందరి నాయకుడు సీఎం కేసీఆర్. కేసీఆర్ దూకమంటే నేను చెరువులకైనా దున్కుత. సీఎం కేసీఆర్‌కు శత్రువులైన ప్రతి ఒక్కరూ నాకు శత్రువులే. ఇప్పటికే బీజేపీ ఇంఛార్జిలు అని చెప్పుకుంటూ వైరా నియోజకవర్గంలో కొంతమంది తిరుగుతాండ్రు. బీజేపీలకు పోయి ఇబ్బందులకు గురి కావద్దు” అని సొంత పార్టీ క్యాడర్ కు ఎమ్మెల్యే రాములు నాయక్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, వైరా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ సానుభూతిపరులైన కౌన్సిలర్లు మొత్తం 18 మంది ఉన్నారు. వీరిలో 12 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు.