అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రసమయి

హుజురాబాద్, వెలుగు : ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కంటే తానే ఎక్కువ చదువుకున్నానని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు. కన్నాపూర్​ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకిషన్​ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితోనే తాను డాక్టరేట్ సాధించానన్నారు.

‘ఎమ్మెల్యే రసమయి అంటే ఎగురుకుంటూ  పాటలు పాడుకుంటూ వస్తాడనుకుంటున్నారు. కానీ నేను పేద దళిత కుటుంబంలో పుట్టినా ఎంఏ బీఎడ్,  ఎంఫిల్,  పీహెచ్​డీలో గోల్డ్ మెడల్ సాధించిన’ అని అన్నారు. 20 ఏండ్లు టీచర్​గా పని చేశానన్నారు. అంతకు ముందు గద్దపాకలో రేషన్ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన రసమయిని కాంగ్రెస్​, బీజేపీ లీడర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని పక్కకు తప్పించారు. ఈ సందర్భంగా తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే అడ్డుకుంటారా..? అంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరోజన, వైస్ ఎంపీపీ రమేశ్ పాల్గొన్నారు.