నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు, అతని కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై పిడుగు పడింది. నియోజకవర్గంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ కారణంగా బంగ్లా పైనున్న పెంట్ హౌస్ పై పిడుగు పడింది. ఆ సమయంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, అతని కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారు. పెంట్ హౌస్ పై ఉన్న పిట్టగోడ అంచున పిడుగు పడడంతో ప్రమాదం తప్పింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కూడా పలుచోట్ల వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, జేబీఎస్, కార్కానా, ప్యాట్నీ, బేగంపేట, చిలకలగూడ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.