
రామాయంపేట, వెలుగు: భూ సమస్యలు తీర్చేందుకే ప్రభుత్వం భూభారతిని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. శుక్రవారం రామాయంపేట రైతు వేదికలో భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఉన్న ధరణి అంతా తప్పుల తడక అన్నారు. అది కేవలం మాజీ ముఖ్యమంత్రి కుటుంబీకులకే ఉపయోగపడ్డదన్నారు.
నేడు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చిందన్నారు. పదేళ్లలో మెదక్ నియోజక వర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. తాను ప్రజలకు కష్టాలు తీర్చేందుకు పనిచేస్తున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ రజిని ఉన్నారు.
భూ సమస్యల పరిష్కారానికే..
అల్లాదుర్గం: భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం అల్లాదుర్గ మండలం చేవెళ్ల రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రమాదేవి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.
భూమి విలువ రూ.5 లక్షల లోపు ఉన్న పక్షంలో ఆర్డీవో స్థాయి, అంతకంటే పైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించారని తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు భూభారతి పోర్టల్ లో ఉన్న అంశాలపై అవగాహన కల్పించారు.